ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
ఈత మొక్కలు నాటి వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించిన ఎక్సైజ్ అధికారులు
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని కోమాళ్ల చెరువు కట్టపై ఎక్సైజ్ శాఖ(Excise Department) ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలను నాటిన దమ్మపేట గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధి హామీ కూలీలు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ(Prohibition and Excise Department) ఇన్స్పెక్టర్ హలవత్ బిచా నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక గీత కార్మికుల జీవనోపాధిని పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రతీ సంవత్సరం తాటి, ఈత, ఖర్జూరం మొక్కలను వర్షకాలంలో నాటే కార్యక్రమం చేపడుతామని తెలియజేశారు.
సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు మాట్లాడుతూ గీత కార్మికుల జీవన వృత్తి అయిన కల్లు తీసే చెట్లను పెంచి భవిష్యత్తులో గౌడ కుల వృత్తి నమ్ముకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా చెరువు కట్టలపై ఈత, తాటి చెట్ల వేళ్లు బలంగా పాతుకు పోవడం వలన చెరువు కట్టలు కోతకు గురికాకుండా బలంగా ఉంటాయి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా పచ్చదనాన్ని పెంచే మొక్కలను సంరక్షించడం మన పర్యావరణానికి, మన మనుగడకు ఎంతో అవసరం అన్నారు.
గ్రామస్తులు చిన్నశెట్టి యుగంధర్ మాట్లాడుతూ... మొక్కలను నాటడం తో పాటు వాటిని సక్రమంగా సంరక్షించి, పెద్దవిగా పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి అన్నారు, చెరువు కట్ట పై మొక్కలు పెరగడానికి పొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలి అని పంచాయతీ సిబ్బందికి, అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, కార్యదర్శి బండి అనంత్ కుమార్, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కక్కిరాల రమేష్, ఆబ్కారీ సిబ్బంది రాణా తదితరులు పాల్గొన్నారు.






