27 March, 2026 | 2:00 AM

మధ్యవర్తిత్వమే రాజీమార్గం

27-03-2026 12:17 AM

కేవలం 200 ఫీజుతో కేసుల పరిష్కారం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్

నాగర్ కర్నూల్, మార్చి 26 (విజయక్రాంతి): పంతాలు పట్టింపులతో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో జరిగే అనర్ధాలను తిరిగి సరిదిద్దుకునేలా రాష్ట్ర హైకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా రాజీమార్గానికి అవకాశం కల్పించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి కుటుంబాలు, చిన్న కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న విభేదాలు క్షనికావేశంలో తీసుకునే నిర్ణయాలతో గొడవ పడుతూ కోర్టుల చుట్టూ తిరిగే వారికి మధ్యవర్తిత్వం వ్యవహరించేలా ప్రత్యేక రాజీ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందుకు కోర్టు ఫీజు కేవలం 200 మాత్రమే ఉంటుందని మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని అమలు చేసేలా ప్రతి కోర్టులో న్యాయవాదులు ప్రత్యేక శిక్షణ పొందారని పేర్కొన్నారు. ఇరు వర్గాల వారికి సమన్యాయం జరిగేలా కోర్టు తీర్పు ద్వారా రాజీ కుదిరే అవకాశం కల్పించిందన్నారు.

ఈనెల 28న అన్ని కోర్టు ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కార అవకాశం కల్పించినట్లు తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంక్, ట్రాఫిక్, ఎక్సైజ్, సైబర్ క్రైమ్ కేసులను సైతం పరిష్కరించుకునే అవకాశం ఉందని సివిల్ కేసుల్లో కోర్టు ఫీజులను సైతం తిరిగి పొందవచ్చునన్నారు.లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన తీర్పు పొందడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. వారితో పాటు పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా ఉన్నారు.