12 June, 2026 | 1:22 AM

అభివృద్ధిలో దూసుకుపోతున్న మెదక్

12-06-2026 12:14 AM
  1. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
  2. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్, జూన్ 11(విజయ క్రాంతి) : మెదక్ పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ప్రజల ప్రాథమిక అవసరాల పరిష్కారమే లక్ష్యంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు వరుస అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చుతూ 18వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించగా, మరోవైపు 20, 21 వార్డుల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారంగా కొత్త బోర్లను ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. గురువారం 18వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబంతో ఆనందాన్ని పంచుకున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

20, 21వ వార్డుల్లో చాలా కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే, వెంటనే స్పందించి కొత్త బోర్ల తవ్వకాలకు చర్యలు చేపట్టారు. ప్రారంభించిన బోర్ల ద్వారా వందలాది కుటుంబాలకు తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన రాజకీయ జీవిత ధ్యేయమని ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.