ప్రజాపాలన కాదు.. విద్యార్థి వ్యతిరేక పాలన
- ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రంలో రూ. 10,800 కోట్లకు పైగా ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ పెండింగ్ లు ఉండి విద్యార్థులు అవస్థలు పడటం సిగ్గుపడాల్సిన విషయమని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో విద్యార్థులతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్నినిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన అందిస్తున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు బకాయిల విడుదల కాకపోవడంతో ఉన్నత విద్యను పూర్తి చేయలేని పరిస్థితులు ఉండటం దారుణమైన విషయమని, గొప్పలు చెప్పుకుంటున్నా నాయకులు సిగ్గు పడాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా పెండింగులో ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






