18 July, 2026 | 9:03 AM

ఆత్మకూరులో పోచమ్మ పండుగ.. తేదీ ఖరారు

18-07-2026 08:48 AM

పెద్దమ్మ ఆలయ కమిటీ సమావేశంలో తేదీ ఖరారు

ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పోచమ్మ పండుగను ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహించాలని పెద్దమ్మ ఆలయ కమిటీ నిర్ణయించింది. పండుగ తేదీని ఖరారు చేసేందుకు శుక్రవారం ఉదయం పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దమ్మ ఆలయ కమిటీ సభ్యులతో పాటు పట్టణంలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని పండుగ నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.

ఆషాఢ మాసం మూడో వారంలో వచ్చే జూలై 28న పోచమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పండుగ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిర్వహణ బాధ్యతలపై సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకున్నారు. పోచమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సమావేశంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మొగిలి శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్, పట్టణ అధ్యక్షుడు ఈర్లదిన్నె శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.