30 May, 2026 | 3:27 AM

చందాలతో భారీ డ్రైనేజీ మ్యాన్‌హోల్ పునర్నిర్మాణం

30-05-2026 12:34 AM

మేడ్చల్ అర్బన్, మే 29 (విజయక్రాంతి): కొన్ని నెలల తరబడి అండర్ డ్రైనేజీ సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్న కండ్లకోయ ప్రజలు,స్థానిక నాయకులు చివరకు అధికారుల కోసం ఎదురు చూడకుం డా చందాలు సేకరించి భారీ అండర్ డ్రైనేజీ మ్యాన్ హోల్ ను పునర్నిర్మించారు.కండ్లకోయలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్ర హం వెనుక ప్రాంతంలో ప్రధాన డ్రైనేజీ మ్యాన్‌హోల్ గత ఆరు నెలలుగా మూసుకుపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగి పొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సమస్య కారణంగా ప్రజలకు దుర్వా సన దోమల బెడద పెరగటంతో పాటు స్థానికులు అనారోగ్య సమస్యతో భయాందోళన కు గురవుతున్నారు.

ఇక్కడి సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులు,మున్సిపల్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పట్టణ ప్రజలు స్థానికు నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.స్థానిక నాయకు లు చందాలు సేకరించి అవసరమైన నిర్మాణ సామాగ్రిని సమకూర్చి,కార్మికులను ఏర్పా టు చేసి మూసుకుపోయిన డ్రైనేజీ మ్యాన్ హోల్ను పూర్తిగా శుభ్రపరచడమే కాకుండా దెబ్బతిన్న భాగాలను మరమ్మత్తు చేసి పునర్నిర్మించారు.

ఈ సందర్భంగా కండ్లగోయ  నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రజల ఆరోగ్యం,భద్రతకు సంబంధించిన సమస్యను సైతం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే తమ సొంత నిధులతో మ్యాన్ హోల్ ను పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కండ్లకోయ మున్సిపల్ పట్టణంలోని అండర్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎస్ రాజేందర్ ముదిరాజ్.హరికృష్ణ.ప్రవీణ్.మహేందర్ పట్టణ ప్రజలు కాలనీవాసులు కనులకోయ ప్రజలు పాల్గొని శ్రమదానం చేశారు.