'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి
- బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- బీజేపీ, కిసాన్ మోర్చా డిమాండ్
కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' (పిఎంఎఫ్బివై) పథకాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు గొట్టే పుల్ల దుర్గా శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు.
దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ పంటల బీమా పథకం మన తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా అందకపోవడం వల్ల రైతాంగం, తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ పంటలన్నింటినీ దీని పరిధిలోకి తెచ్చి, కౌలు రైతులకు సైతం న్యాయం జరిగేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






