కుల రాజకీయం కాదు.. అభివృద్ధి ఎజెండాగా ఉండాలి
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 10 (విజయక్రాంతి): ప్రజలకు కావాల్సింది కుల రాజకీయాలు కాదని అభివృద్ధి ఎజెండగా ఉండాలని ప్రభుత్వ విప్, యెన్నం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టి పిసిసి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద గల గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాదయాత్ర గా అశోక్ టాకీస్ వరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ధర్నా ఒక్కరోజు కార్యక్రమం మాత్రమే కాదు, ఇది నిరంతర పోరాటానికి నాంది కావాలన్నారు.
ఈ రోజు దేశంలో ఒక చేతగాని ప్రభుత్వం కొనసాగుతోందని, విదేశీ ఒత్తిడులకు లోనై, ప్రజల సమస్యలను పట్టించుకోని పాలన సాగుతోందని ఆరోపించారు . దేశ ప్రజలను బాధల్లోకి నెట్టే విధంగా బిజేపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల్ని నలిపేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన సాగించిందన్నారు. అనుభవం లేని పాలన కారణంగా ప్రజలపై భారాలు పెరుగుతున్నాయి. మతాలు, కులాల మధ్య విభేదాలు పెంచి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడపలేకపోతోందని అన్నారు. పన్నెండు సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రజల సమస్యలకు సరైన పరిష్కారాలు చూపలేకపోతున్నారని, మధ్యతరగతి, పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
ధరల భారం పేదవాడి పైన పెరిగిపోయిందన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, 2004లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన మద్దతుతో మార్పు వచ్చినట్టే, ఇప్పుడు కూడా మనం కలిసి పనిచేయాలని సూచించారు. గ్రామ గ్రామానికి, బస్తీ బస్తీకి వెళ్లి ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, రాములు యాదవ్, సిజె బెనహర్, రాజు భాయి, ఫయాజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, నగర కార్పొరేటర్లు హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






