29 May, 2026 | 2:55 AM

కాజీపేటలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ

29-05-2026 01:31 AM
  1. ఐదేళ్లలో 200 రైళ్లు..
  2. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
  3. ప్రతి రైలులో 20 కోచ్‌లు
  4. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

హైదరాబాద్, మే 28(విజయక్రాంతి): కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని తెలిపారు.  కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో ఈ యూని ట్ 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారుచేస్తుందన్నారు. వీటిని దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.

సాధారణంగా 300 కిలోమీటర్ల దూరంలోని రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే ఈ రైళ్లు పలు స్టేషన్లలో అగుతాయని తెలిపా రు. పట్టణాలు, నగరాల మధ్య పౌరుల ప్రయాణ సౌలభ్యం లక్ష్యంగా ప్రతి ట్రిప్పులో అనేక స్టాప్‌లుంటాయని, పట్టణాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యా ర్థులు, ఆరోగ్య, ఉద్యోగ అవసరాల కోసం సామాన్య ప్రజలకు కూడా ఈ రైళ్లు సౌల్యంగా ఉంటుందన్నారు. కొత్తగా  అందుబాటులోకి వచ్చే ఇంటర్‌సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపొందుతాయన్నారు.

ప్రతి రైలులో 20 కోచ్‌లుంటాయని, వీటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు అమర్చుతామన్నారు. ఈ రైళ్లు గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు చెప్పారు. వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుందని తెలిపారు. రైలు బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్ జనరేటర్‌గా మారి, పునరుత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే ఆధునాతన పరిజ్ఞానంతో తయారుచేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైల్వే శాఖ భారీ సంఖ్యలో ఈ రైళ్లను నడపడం ద్వారా దేశంలో పర్యావరణహిత, కాలుష్య రహిత సాధానాల సామర్థ్యం పెరుగుతుందన్నారు.