బాటసింగారం మార్కెట్లో మామిడి దోపిడీ!
అధికారుల అండతోనే దళారుల దందా
ప్రశ్నించే రైతులను ముప్పు తిప్పలు
ఉత్సవ విగ్రహంలా పాలక మండలి
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 20: అది రైతులు పండించిన పంటను అమ్ముకునే వేదిక కాదు.. దళారులు పేద రైతుల రక్తాన్ని పీల్చే ‘అడ్డా’గా మారింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి ఆశతో వచ్చే రైతుకు అక్కడ మిగిలేది అప్పులే. ఏళ్ల తరబడి పాతుకుపోయిన దళారులు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు కలిసి బాటసింగారం (గడ్డిఅన్నారం) పండ్ల మార్కెట్ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ‘చెప్పేది మేమే.. కొనేది మేమే.. ధర కట్టేది మేమే’ అన్నట్టుగా దళారుల రాజ్యం నడుస్తోంది.
ఫ్రూట్ మార్కెట్లో కమిషన్ ఏజెంట్ల బాధలు పడలేక పలువురు రైతులు తమ బాధలు వెళ్లి బుచ్చారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఒక రైతు ఆవేదన వింటే సాగు ఎంత భారమైందో అర్థమవుతుంది. తోట కౌలుకు రూ. 2 లక్షలు, మందులు, కూలీలు, రవాణాకు మరో రూ. 2 లక్షలు.. ఇలా మొత్తం రూ. 4 లక్షలు ఖర్చు చేసి మార్కెట్కు వస్తే, దళారుల మాయాజాలంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. రైతుకు రూ. 70 వేలు వస్తే, ఒక్క పైసా పెట్టుబడి లేని దళారికి రూ. 90 వేలు కమీషన్ల రూపంలో మిగులుతోందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సిండికేట్గా మారిన కమిషన్ ఏజెంట్లు..
ఏళ్ల తరబడి మార్కెట్లోనే తిష్టవేసిన దళారులు, అధికారులను తమ కనుసైగలతో శాసిస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన క్రయవిక్రయాలు దళారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కాలం చెల్లిన లైసెన్సులను అధికారుల అండతో రెన్యువల్ చేయించుకోవడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద బినామీ లైసెన్సులు పొంది మార్కెట్ను గుత్తాధిపత్యం చేస్తున్నారు. కిలోమీటర్ల దూరం నుంచి అలసిపోయి వచ్చిన రైతులను గంటల తరబడి వేచి ఉంచుతున్నారు. రైతు అసహనానికి గురై తక్కువ ధరకైనా సరే అమ్ముకుని వెళ్లాలనే కుట్రతోనే ఈ జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నష్టాన్ని భరించలేక.. మామిడి తోటల తొలగింపు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్ మామిడికి మార్కెట్లో దక్కుతున్న గౌరవం ఇది. దళారుల ఆగడాలు భరించలేక, గిట్టుబాటు ధర లేక కొల్లాపూర్ ప్రాంత రైతులు తమ కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి తోటలను నరికేస్తున్నారు. ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కేవలం రైతు నష్టం మాత్రమే కాదు.. రాష్ట్ర ఉద్యానవన రంగానికే గొడ్డలి పెట్టు అని చెప్పవచ్చు.
అధికారులు అండ లేకపోతే... దళారులు ఇంత బహిరంగంగా దోపిడీకి పాల్పడలేరు. మార్కెట్కు వచ్చే రైతుల నుంచి తరుగు, అదనపు కమిషన్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టకపోతే... భవిష్యత్తులో ఈ మార్కెట్ కు రైతులు రావడానికి భయపడాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బాటసింగారం మార్కెట్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన దళారి వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడాలి మరి ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ అధికారులు బాటసింగారం దోపిడి వివరం పై దృష్టి పెడతారా? లేదో వేచి చూడాల్సిందే.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..
వరి పంటను కొనుగోలు చేసినట్లుగానే, మామిడిని కూడా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధర కల్పించకపోతే మామిడి రైతు ఆత్మహత్యలే శరణ్యం.‘
- శివ, రైతు (కొండనాగుల, నాగర్కర్నూల్ జిల్లా)
అవినీతిపై విచారణ జరపాలి..
‘పాలకవర్గం బినామీలే ఇక్కడ కమిషన్ ఏజెంట్లుగా అవతారమెత్తారు. అధిక శాతం కమిషన్ వసూలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల వెంటనే స్పందించి ఈ భారీ కుంభకోణంపై విచారణ జరిపించాలి.-
డాక్టర్ రామ్ నర్సయ్య గౌడ్, మాజీ చైర్మన్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ






