16-01-2026 06:23:19 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిషేధిత చైనా మంజా తగిలి బైక్ పై వెళ్తున్న యువకుడికి గాయాలయ్యాయి. ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన కాసర్ల మహేందర్ అనే యువకుడు పెద్దపల్లిలో తన పనులు ముగించుకుని బైక్ పై హెల్మెట్ ధరించి స్వగ్రామమైన నారాయణపల్లికి పూసాల రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా అతడికి తగిలింది. మాంజా బలంగా తగలడంతో అది హెల్మెట్ గ్లాస్‌పైకి ఎగసి మరీ ముక్కు, కనుబొమ్మ చివర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహేందర్ ను స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించడం వల్ల చిన్న ప్రమాదంతో బయటపడ్డాడని స్థానికులు తెలిపారు.