24 August, 2026 | 11:03 PM

డీజిల్‌ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్‌

24-08-2026 09:24 PM

బిక్కనూర్,(విజయ క్రాంతి): బిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులోని నరసింహ స్టోన్‌ క్రషర్‌లో హిటాచీ ఎక్స్కవేటర్ల డీజిల్‌ ట్యాంకుల తాళాలు పగులగొట్టి సుమారు 80 లీటర్ల డీజిల్‌ చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు నేనావత్‌ రాజేందర్‌, నేనావత్‌ రాజుగా గుర్తించారు. ఈ నెల 24న బిక్కనూర్‌ టోల్‌గేట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో రాత్రి సమయంలో క్రషర్‌ ప్రాంగణంలోకి ప్రవేశించి రెండు హిటాచీ వాహనాల డీజిల్‌ ట్యాంకుల తాళాలు పగులగొట్టి పైప్‌ సహాయంతో డీజిల్‌ చోరీ చేసినట్లు వెల్లడైంది. చోరీ చేసిన డీజిల్‌ను పెద్దమల్లారెడ్డి చెరువు కట్ట వద్ద పొదల్లో దాచినట్లు తెలిపారు. నిందితుల నుంచి 80 లీటర్ల డీజిల్‌, రెండు డీజిల్‌ క్యాన్లు, ఇనుప రాడ్‌, సైఫనింగ్‌ పైప్‌, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఎస్‌.అనిల్‌ తెలిపారు.