డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత
మానవత్వాన్ని చాటుకున్న తోటి డ్రైవర్లు
గరిడేపల్లి,(విజయక్రాంతి): వెళ్లిదండ గ్రామానికి చెందిన డ్రైవర్ గోదాటి సైదులు ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో తోటి డ్రైవర్లు మానవత్వాన్ని చాటుతూ మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. సైదులు పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన తోటి డ్రైవర్లు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం అందరూ కలిసి రూ.63,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
కష్టకాలంలో తమ తోటి డ్రైవర్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం చేయడం పట్ల పలువురు అభినందించారు. తోటి డ్రైవర్లు మాట్లాడుతూ.. సైదులు ఆకస్మికంగా మృతి చెందడం తమను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి తమ వంతు సహాయం అందించడం బాధ్యతగా భావించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోటి డ్రైవర్లు కొండ సైదులు (కేసీఆర్), అంథోని కృష్ణ, ఆకుల గోపీచంద్, వేణు, నర్సింహ, గోపి, సతీష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.






