నాపై దుష్ప్రచారం..
- రూ.10 లక్షల కోసం న్యాయవాది సుబ్బారావు బ్లాక్‌మెయిల్
పంజాగుట్ట పోలీసులకు సింగర్ మంగ్లీ ఫిర్యాదు
పంజాగుట్ట, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ న్యాయవాది సుబ్బారావుపై గాయని మంగ్లీ ఫిర్యాదు చేశారు. ఇటీవల సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో దుర్భాషలాడుతూ.. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని హైకోర్టు న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై ప్రముఖ గాయని మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదుచేశారు. ‘ఫైనాన్స్ మోసం కేసుతో నాకు సంబంధం లేదు.
నాకు చేతినిండా పని ఉంది.. ప్రజలను మోసం చేసే పనిచేయను. బాధితుల తరఫున నేనుకూడా పోరాడుతా. నాకు డబ్బు ఆశ లేదు.. పాటలే నా ప్రపంచంగా జీవిస్తున్నా. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా మూలాలు మర్చిపోను. నా తమ్ముడిపై కూడా ఆరోపణలు మోపుతున్నారు. డబ్బు కట్టలతో ఉన్న వ్యక్తి నా తమ్ముడు కాదు’ అని మంగ్లీ పేర్కొన్నారు. దీనితో గాయని మంగ్లీ, హైకోర్టు న్యాయవాది సుబ్బారావు మధ్య వివాదం ముదిరి పాకానపడింది.
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు పంజాగుట్ట, నార్సింగి పోలీస్‌స్టేషన్లలో పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను రూ. 10 కోట్లు మోసం చేశారని న్యాయవాది సు బ్బారావు ఆరోపించిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో మంగ్లీ సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల హస్తం కూడా ఉం దని ఆయన పంజాగుట్ట పోలీసులకు ఇటీవల ఫిర్యాదుచేశారు.
మంగ్లీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నా రు. అయితే న్యాయవాది ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. సుబ్బారావు తనను డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నా రు. కేవలం పబ్లిసిటీ కోసం, ముఖ్యంగా రాబోయే బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకోవడానికే ఆయన ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై పంజాగుట్ట పోలీసులు కేసు న మోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇరువురి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు, ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. సో షల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా పోలీసులు దృష్టి సారించారు.




