3 August, 2026 | 2:27 AM

జైల్ భరోను విజయవంతం చేయండి

03-08-2026 01:19 AM

మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 2: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించే జైల్ భరోను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ సిఐటియూ ఆఫీసులో సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సదస్సులో జైల్ భరో ను విజయవంతం చేయాలని కరపత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగంలోకి బిజెపి ప్రభుత్వం స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, జీరో సుంకాలతో దిగుమతులు రావడంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాలా తీస్తున్నారని, కార్మిక వర్గం స్వాతంత్రం రాక ముందే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దుచేసి దేశంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లాభాలను చేకూర్చడం కోసం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చారన్నారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకూతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమానికి పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు రైతులు, కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.