2 March, 2026 | 9:05 AM

చేవెళ్లలో భారీ అగ్నిప్రమాదం

02-03-2026 02:00 AM

రిషిత్ ఆటోమోటివ్స్ గోదాం దగ్ధం..  రూ. 5 కోట్ల మేర నష్టం

చేవెళ్ల, మార్చి 1 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. స్థానిక శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఉన్న ‘రిషిత్ ఆటోమోటివ్స్’ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, సుమారు ఐదు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాథమిక సమాచారం మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5:00 గంటలకు మంటలు ప్రారంభమైగోదాంలో నిల్వ ఉంచిన హీరో బైకులకు సంబంధించిన స్పేర్ పారట్స్ పూర్తిగా బూడిదయ్యాయి.

నిర్వాహకుల అంచనా ప్రకారం రూ. 3.5 కోట్ల విలువైన సామాగ్రి, అలాగే రూ. 1.50 కోట్ల విలువైన బిల్డింగ్ దెబ్బతిన్నాయి. మొత్తం నష్టం సుమారు రూ. 5 కోట్లుగా భావిస్తున్నారు.స్థానికుల సమాచారంతో కేవలం 4 నిమిషాల్లోనే చేవెళ్ల ఫైర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి నాయకత్వంలో 10 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదాంలో ప్లాస్టిక్, రబ్బరు వంటి వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

చేవెళ్ల మరియు షాద్నగర్ అగ్నిమాపక యంత్రాల సహాయంతో సుమారు 5 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో పనిచేసే ఐదుగురు సిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో పెను ప్రమాదం నుంచి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.