18 July, 2026 | 9:44 AM

డేటింగ్ యాప్ ఉచ్చులో చిక్కిన యువకుడు

18-07-2026 09:42 AM

జూబ్లీహిల్స్ పబ్‌లో మద్యం,మాదాపూర్‌లో యువకుడిపై దాడి

శేరిలింగంపల్లి,జూలై 18 (విజయక్రాంతి): డేటింగ్ యాప్‌ల ద్వారా ఏర్పడే పరిచయాలు ఇప్పుడు యువతరానికి ‘ట్రాప్’గా(Dating APP Trap) మారుతున్నాయి. ఇటీవలి మరో ఘటనలో ఓ యువకుడు తన డేటింగ్ యాప్ స్నేహితురాలి స్నేహితుల దాడికి గురై, తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ పబ్ నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్ వరకు విస్తరించింది. ఓయూ కాలనీకి చెందిన యువకుడు కొంతకాలం క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతితో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ గత శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌లో కలుసుకుని మద్యం సేవించారు.

ఆ సమయంలో యువతి బిల్లు నేనే చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పబ్ నుంచి బయలుదేరే సమయానికి పరిస్థితి మారిపోయింది. యువకుడు మొత్తం బిల్లు చెల్లించవలసి వచ్చింది. పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యువకుడు తాను చెల్లించిన డబ్బులు తిరిగి అడగడంతో వాగ్వాదం చెలరేగింది. ఈ వివాదం హీటెక్కడంతో యువతి తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిచింది. ఆమె స్నేహితులు యువకుడిని బలవంతంగా మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి కొద్దిసేపటి పాటు దారుణంగా కొట్టారు.

ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత యువకుడు సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువతి ఆమె స్నేహితులను అరెస్టు చేసేపనిలో పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు, మొబైల్ ఫోన్ లొకేషన్(Mobile phone location) వివరాలు సేకరిస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.ఇటీవలి కాలంలో డేటింగ్ యాప్‌ల ద్వారా ఏర్పడే స్నేహాలు ఆర్థిక వివాదాలు, శారీరక దాడులకు దారితీస్తున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువతరం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.