2 March, 2026 | 7:14 AM

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి

02-03-2026 02:01 AM

షాద్‌నగర్, మార్చి 1 (విజయక్రాంతి)కొందుర్గు మండలం లోని రామ్ చంద్రపుర్ చౌరస్తాలో వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన చలివేంద్రంను  ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడంపాటి రవీందర్ రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ప్రజల అవసరాల నిమిత్తం చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.

వేసవి కాలంలో ఎండ తాకిడికి ఎంతోమంది మంచినీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతుంటారు, అలా అవస్థలు పడొద్దు అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రవీందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్నటువంటి చలివేంద్రం ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. డబ్బు ఉండడం గొప్ప కాదు,డబ్బు ఉండి ప్రజలకు సేవ చేయడం గొప్ప అని అన్నారు.

రవీందర్ రెడ్డి గతంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా పేద ప్రజల అవసరాల నిమిత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్థరాత్రి అప రాత్రి అని చూడకుండా వెంటనే స్పందించే మంచి మనసున్న నాయకుడు రవీందర్ రెడ్డి అని అన్నారు. ప్రజల మెప్పు పొందాడు గనుకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సతీమణి అనూష ను భారీ మెజార్టీతో గెలిపించి సర్పంచిగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చలివేంద్రం ను ప్రారంభించి పేద ప్రజల దాహాన్ని తీర్చడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. మా నాన్నగారైన మధుసూదన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు పేద ప్రజలకు మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయడం అలవాటు చేసుకోమని అన్నారు.పేద ప్రజలకు సహాయం చేయడం ద్వారా వచ్చే తృప్తి వర్ణనాతీతం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కొందుర్గు మండల బిఆర్‌ఎస్ నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.