18 July, 2026 | 11:24 AM

సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

18-07-2026 11:01 AM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court) అనుమతి ఇచ్చినప్పటికీ “యువ సంగ్రామ సదస్సు”ను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వం కుట్రలు చేస్తోందని  మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యువ సంగ్రామ సదస్సుకు హాజరుకాకుండా సబితా ఇంద్రారెడ్డిని(Sabitha Indra Reddy house arrest) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరుద్యోగ సమస్యలు, యువత హక్కుల సాధనకై సదస్సుకు హాజరవుతున్న మాజీ మంత్రిని పోలీసులు అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. "కోర్టు అనుమతితో సభ నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏంటి? నిరుద్యోగుల పట్ల వివక్ష చూపడం రేవంత్ ప్రభుత్వానికి తగదు" అని సబితా ఇంద్రారెడ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

 ఇంత భయమెందుకు రేవంతూ?: ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్

నిరుద్యోగ యువత తరఫున బీఆర్ఎస్ గళమెత్తితే ఇంత భయమెందుకు రేవంతూ? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ(BRS General Secretary) ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. యువ సంగ్రామ సదస్సుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  ​హైకోర్టు అనుమతి ఉన్నా, మల్కాజిగిరి సీపీ సుమతి స్వయంగా యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇచ్చినా... బీఆర్ఎస్ నాయకులను వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) మండిపడ్డారు. ​ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని పెద్దపెద్ద నీతులు చెబుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి పౌరుల రాజ్యాంగ హక్కులను నిస్సిగ్గుగా కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను ప్రజాస్వామ్యబద్ధంగా యువ సంగ్రామ సదస్సుకు హాజరవ్వకుండా అడ్డుకుంటే, ఈ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.