గుడిమల్కాపురంలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ ఆగస్ట్ 23(విజయకాంత్రి): నగరంలోని గుడిమల్కాపురంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొఘల్ కానాల సమీపంలోని ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్రమంగా భారీగా వ్యాపించాయి. గోదాంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్, చెక్క సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది పలు ఫైరింజన్లతో నీటిని చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలపై ప్రాథమికంగా ఎలాంటి పూర్తి సమాచారం వెలువడలేదు. గోదాంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలపై అధికారులు అంచనా వేయనున్నారు.






