23 August, 2026 | 12:47 PM

చెన్నైలో ఘోరం: మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ

23-08-2026 11:48 AM

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోరం జరిగింది. మహిళను చంపిన దుండగులు బిర్యానీ వండి రైల్లో వదిలేసి పారిపోయారు. చెన్నై-ఢిల్లీ రైలులో మానవ శరీర భాగాల కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 5న ఆగ్రా స్టేషన్ లో కనిపించిన సూట్ కేస్ లో మహిళ శరీర భాగాలను గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైలోని ఓ ఇంట్లో హయత్ నిషా అనే మహిళను హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. మృతదేహాన్ని భాగాలతో బిర్యానీ వండినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ఇంట్లో బిర్యానీ పాత్ర స్వాధీనం చేసుకున్నారు. అందులో అన్నంతో పాటు మానవ శరీర భాగాలు గుర్తించారు. ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు.

ట్రాలీ బ్యాగ్‌లో కుళ్ళిన స్థితిలో మృతదేహ భాగాలు 

ఈ నెల ప్రారంభంలో ఆగ్రా వద్ద చెన్నై-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ట్రాలీ బ్యాగ్‌లో కుళ్ళిన స్థితిలో మృతదేహ భాగాలు లభ్యమైన 38 ఏళ్ల మహిళకు చెందినవిగా భావిస్తున్న మరికొన్ని శరీర భాగాలు, శుక్రవారం గుడువాంచేరిలోని ఒక ఇంట్లో లభించాయి. మరణించిన వ్యక్తిని ఒడిశాకు చెందిన హయాతున్ నిషాగా గుర్తించారు. ఆమె గుడువాంచేరిలో నివసిస్తూ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న అస్సాంకు చెందిన మానిక్ ఉద్దీన్ లస్కర్, ఒడిశాకు చెందిన అతని భాగస్వామి భగబతి మాఝీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు, పోలీసులు శుక్రవారం గుడువాంచేరిలోని మసీదు వీధిలో ఉన్న ఆ జంట అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించి, ఒక పెద్ద పాత్రలో మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిషా ఆ జంటతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. నిషాకు లస్కర్‌తో సంబంధం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె కుమారుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకించాడని, తల్లితో గొడవ పడిన తర్వాత వేరుగా నివసిస్తున్నాడని సమాచారం. ఆమె కనిపించకుండా పోవడంతో అతను పోలీసులను ఆశ్రయించగా, గుడువాంచేరి పోలీసులు వ్యక్తి అదృశ్యం (missing case) కింద కేసు నమోదు చేశారు. చెన్నై సెంట్రల్ వద్ద ఒక పురుషుడు, ఒక మహిళ ఎర్రటి ట్రాలీ బ్యాగ్‌ను మోసుకువచ్చి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. పోలీసులు వారిద్దరి కదలికలను గుర్తించి, చివరకు శుక్రవారం సోదాలు నిర్వహించిన గుడువంచేరిలోని అద్దె ఇంటి వద్దకు చేరుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.