జపాన్‌లో భారీ భూకంపం.. టోక్యోలోనూ ప్రకంపనలు
టోక్యో: ఆదివారం తెల్లవారుజామున టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్‌లో(Japan) 5.9 తీవ్రతతో కూడిన మధ్యస్థ స్థాయి భూకంపం(Earthquake) సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారని, వారిలో చాలామందికి స్వల్ప గాయాలయ్యాయని, సునామీ ముప్పు ఏమీ లేదని అధికారులు తెలిపారు. జపాన్ వాతావరణ శాఖ ప్రకారం, తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతమైన దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో, 70 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత ప్రాథమిక అంచనా ప్రకారం 5.8గా ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే నమోదు చేసింది.
ప్రాంతంలోని నాలుగు ప్రిఫెక్చర్లలో (పరిపాలనా ప్రాంతాల్లో) 23 మంది గాయపడ్డారని ఆయా ప్రాంతాల అధికారులు ప్రకటించారు. వీరిలో సైతామాలో తొమ్మిది మంది, కనగావాలో మరో తొమ్మిది మంది, చిబాలో నలుగురు, ఇబరాకిలో ఒకరు ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి, భయాందోళనలతో మంచం దిగే క్రమంలో కింద పడిపోవడం, ఫర్నిచర్, తలుపులకు బలంగా తగలడం వల్ల వీరిలో చాలామంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
వీరిలో కనగావా ప్రిఫెక్చర్‌లోని యోకోహామాకు చెందిన 80 ఏళ్ల వయసున్న ఒక మహిళ కూడా ఉన్నారని సూచించారు. ఆమె మంచంపై నుంచి కింద పడి తుంటి భాగంలో తీవ్ర గాయానికి గురైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. భూకంపం కారణంగా టోక్యో, నరిటా విమానాశ్రయాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే ఇతర లోకల్ రైళ్లు ఆలస్యమయ్యాయని, అయితే షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయని వాటి నిర్వాహక సంస్థ ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. సంభవించగల నష్టం తీవ్రతను అంచనా వేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ప్రధాని సనాయె తకైచి 'ఎక్స్' (X) వేదికగా పేర్కొన్నారు.






