23 August, 2026 | 10:06 AM

మారెళ్లపాడు నుంచి నీటిపై స్పష్టత లేదు.. తుమ్మలచెరువు తూములు తీయొద్దు

23-08-2026 09:25 AM

అందుబాటులో ఉన్న నీటిని కాపాడి రైతులను నష్టపరచొద్దు: రామచంద్రపురం ఆయకట్టు రైతులు

అశ్వాపురం, ఆగస్టు 23 (విజయక్రాంతి) : మారెళ్లపాడు నుంచి తుమ్మలచెరువుకు నీరు ఎప్పుడు చేరుతుందనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో, తుమ్మలచెరువులో ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని తూముల ద్వారా విడుదల చేసి రైతులను నష్టపరచొద్దని రామచంద్రపురం ఆయకట్టు రైతులు అధికారులను కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. అధిక నీరు అవసరమయ్యే పంటలు వేసి ఇబ్బందులు పడొద్దని జిల్లా కలెక్టర్‌ సూచించిన విషయాన్ని రైతులు గుర్తుచేశారు.

మారెళ్లపాడు నుంచి తుమ్మలచెరువుకు నీరు చేరే విషయంలో స్పష్టత లేని సమయంలో చెరువులోని నీటిని తూముల ద్వారా విడుదల చేస్తే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మెరక పంటలకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించాలని కోరారు. తుమ్మలచెరువు తూములు తీయకుండా నీటిని అందుబాటులో ఉంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మాసిరెడ్డి వెంకటరెడ్డి, బద్దం శంబిరెడ్డి, మొగిళ్ల వీరారెడ్డి, వెంగళ సోమిరెడ్డి, బొక్క రవి, తూము వెంకన్న, బద్దం ప్రభాకర్‌, బద్దం రాములు, బద్దం సత్తిరెడ్డి, బద్దం నారాయణ, యానాల నరసింహారెడ్డి, మద్ది కృష్ణారెడ్డి, వెంగళరావు సత్తిరెడ్డి, కొప్పుల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.