అమీన్ పూర్ ప్రభుత్వ విద్యారంగానికి మహర్దశ
అమీన్ పూర్, ఆగస్టు 23(విజయక్రాంతి): అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ, అమీన్పూర్ డివిజన్లలో గల పేద మధ్యతరగతి విద్యార్థులకు అతి త్వరలో అత్యధిక వసతులతో కూడిన క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమీన్ పూర్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం, నవ్య రోడ్డులో నూతన పాఠశాలలకు, కిష్టారెడ్డిపేటలో ఉన్నత పాఠశాల నవీనీకరణ పనులకు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం క్యూర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఆధునిక వసతులతో క్యూర్ అర్బన్ స్కూల్స్ నిర్మిస్తోందని తెలిపారు.
వీటి నిర్మాణం ద్వారా ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఆటస్థలాలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నూతన పాఠశాలలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణ, TGEWDIC ఈఈ శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి సుధాకర్, సీనియర్ నాయకులు గోపాల్, కృష్ణ, జగదీష్, సునీత, శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు..






