11 May, 2026 | 10:37 AM

రెక్కల కష్టం వర్షార్పణం..!

11-05-2026 09:38 AM
  1. అకాల వర్షానికి వరద నీటిలో కొట్టుకుపోయిన మొక్కజొన్న. 
  2. తూకం వేసినా కదలని మొక్కజొన్న కుప్పలు.
  3. నెలల తరబడి మార్కెట్లోనే రైతుల నిరీక్షణ.  
  4. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్. 

నాగర్ కర్నూల్ మే 10 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన మొక్కజొన్న పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. నెలల తరబడి పంటలు పండించి తీర ధాన్యం అమ్ముకునేందుకు మార్కెట్కు వస్తే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటను అమ్ముకోవడం కోసం కూడా నెలల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఆదివారం సాయంత్రం కురిసిన భారీ అకాల వర్షానికి మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. రైతుల కళ్ళముందే వరద నీటిలో మొక్కజొన్న కొట్టుకుపోతుండగా వచ్చే కంటనీరు కూడా వర్షపు నీటిలో కలిసిపోయిందని రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా సరిపడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా అరకొర ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుంచి తూకం వేసిన ధాన్యాన్ని కూడా హమాలీలు, లారీల కొరత సాకు చూపి ధాన్యం తరలింపు జరపడం లేదని మండిపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కి వచ్చిన దాన్యం సైతం తూకం వేసి కొనుగోలు చేసినప్పటికీ ధాన్యం ఆయా గోదాములు మిల్లులకు తరలించేదాకా రైతులకు నిరీక్షణ తప్పడం లేదని ఏకంగా ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెప్పినప్పటికీ సంబంధిత అధికారులు వారి ఆదేశాలను బేకాతర్ చేస్తూ రైతులను కుప్ప వద్ద నుండి కదలనివ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫలితంగా ఇంటి నుంచి మార్కెట్కు తిరగలేక మార్కెట్లోనే పిల్లా పాపలను, ఇతర వ్యవసాయ పనులను వదిలి ఇక్కడే తలదాచుకున్న పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని కూడా సొంతంగా హమాలీలను ఏర్పాటు చేసుకొని సొంతంగానే గన్ని బ్యాగులు కొనుగోలు చేసుకుని అత్యధికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నుండి కాపాడుకోవడం కోసం దాన్యం బస్తాలను గోదాంలోకి తరలించే క్రమంలోనూ ఖర్చుల భారం రైతులపైనే వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తూకం వేయని మొక్కజొన్న దాన్యం పూర్తిగా వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో ఆ రైతులు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే రైతుల కష్టం వర్షార్పణం అవుతోందని మండిపడ్డారు.