11 May, 2026 | 4:53 AM

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

11-05-2026 03:32 AM
  1. నిధులిస్తేనే తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు 
  2. ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు బీజేపీ నేతలను ద్రోహులుగా చూస్తారు
  3. ప్రధానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ బహిరంగ లేఖ 

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి) : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలి.. నిధులు, అనుమతులు ఇస్తేనే రాష్ట్రంపై ప్రేమ ఉందని భావిస్తాం.. లేదంటే తెలంగాణ ప్రజలు  బీజేపీ నేతలను ద్రోహులుగా చూస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి అవస రమైన నిధులు, పలు ప్రాజెక్టులకు అనుమతుల విషయమై ఆదివారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశా రు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలి.

రూ.38,595 కోట్లతో విస్తరిం చనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టేందుకు సహకరిం చాలని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్  ఇప్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు జాతీయ స్థాయి అర్బన్ రివర్ రీస్టోరేషన్ ప్రాజెక్టుగా గుర్తించాలి. బాపూఘాట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలన్నారు.

రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి తక్షణమే ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వడంతో పాటు దక్షిణ భాగం నిర్మాణానికి కూడా అనుమతు లు మంజూరు చేయాలి. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును 100 శాతం కేంద్ర నిధులతోనే చేపట్టాలి. హైదరాబాద్ బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలి.  హైదరాబాద్- బెంగళూరు హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి చొరవ చూపాలి. రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్ల ఆర్థిక సాయం చేయడంతో పాటు హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లకు సహకారం చేయాలని కోరారు. హైదరాబాద్ ఫ్యాబ్ సిటీకి సెమీకండక్టర్ మిషన్ కింద ప్రాధాన్యం ఇవ్వాలని, కేంద్ర పరిశీలనలో ఉన్న సెమీకండక్టర్ ప్రాజెక్టులకు తుది ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.  

విభజన హామీలను నేరవేర్చాలి

తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రధాని మోదీని మహేష్‌కుమార్‌గౌడ్ కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తిస్థాయి యూనిట్‌గా  అభివృద్ధి చేయాలని, కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు.  తెలంగాణపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని, కర్ణాటక రాష్ట్ర ఎంపీ తేజస్వీ సూర్య  తెలంగాణను పాకిస్తాన్‌తో  పోల్చడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గతంలో మోదీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలకు కేంద్రం గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.