పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊపేక్షించేది లేదు
నిన్ననే సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం
ఎవరికి వారే పోటీ చేస్తామని ప్రకటించడం సరైంది కాదు
సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ కు నోటీసులు
హైదరాబాద్: కొండా సుస్మిత కామెంట్స్( Sushmita comments) రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీకి, పీసీసీకి మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వివరణ ఇవ్వనున్నారు. సుస్మిత అలా ఎందుకు మాట్లాడాల్సివచ్చిందో కొండా సురేఖ రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు. పరకాలలో సీఎం రేవంత్(CM Revanth Reddy) సభ తర్వాత రాజకీయ చిచ్చు రాజుకుంది. రేవూరిని మళ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో వివాదం మొదలైంది.
చిన్నారెడ్డి, కొండా సుస్మిత వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందన
చిన్నారెడ్డి, కొండా సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కుమార్తె వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ కోరామని తెలిపారు. నిన్ననే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు.
క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తామని వెల్లడించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Banswada MLA Pocharam Srinivas Reddy) వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. పోచారం ఆవేదనను అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ చీఫ్ తేల్చిచెప్పారు. ఎవరికి వారే పోటీ చేస్తామని ప్రకటించుకోవడం సరైంది కాదని హితవు పలికారు. 22ఏపై బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. కిందిస్థాయిలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని వివరించారు.






