20 August, 2026 | 12:27 PM

వెంగళరావునగర్‌లో వీధికుక్కల బీభత్సం

20-08-2026 11:22 AM

చిన్నారితో పాటు మహిళపై దాడి.. కుక్కల పట్టివేతకు మున్సిపల్‌ చర్యలు

సత్తుపల్లి,ఆగస్టు 20(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావునగర్‌(Vengalrao Nagar) 11వ వార్డులో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. గురువారం ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. అదే ప్రాంతంలో రామలక్ష్మి మనవరాలిపై, బత్తుల కోటేశ్వరరావు భార్య బత్తుల దుర్గపై కూడా కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వరుస ఘటనలతో 11వ వార్డు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధికుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్‌ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కుక్కల పట్టివేతకు మున్సిపల్‌ సిబ్బంది

వార్డులో కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ సిబ్బంది గురువారం కుక్కల పట్టివేతకు రానున్నట్లు స్థానికులు తెలిపారు. కుక్కల పట్టివేత కార్యక్రమానికి వార్డులోని ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో వీధికుక్కల నుంచి రక్షణ కల్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.