22 March, 2026 | 3:24 AM

రాములోరి సన్నిధిలో లక్నో జట్టు

22-03-2026 12:00 AM

అయోధ్య, మార్చి 21: ఐపీఎల్ 19వ సీజన్ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నా యి. వచ్చే శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో ఈ మెగా లీగ్  మొదలవుతుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అయోధ్య రాముడి దర్శనం చేసుకుంది. శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకాతో పాటు ఆ జట్టు క్రికెటర్లు రాములోరి దీవెనలు తీసుకున్నారు.

ఈ సీజన్‌ను గొప్పగా ఆరంభించాలనే ఉద్దేశంతో లక్నో సూపర్ జెయింట్స్ క్రికెటర్లు రాముడి ఆలయాన్ని సందర్శించారు. తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదనీ, ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ తమ జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారనీ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా చెప్పారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో నాకౌట్‌కు ముందే ఇంటిదారి పట్టింది.