కూతురు వ్యాఖ్యలపై ‘కొండా’ నో కామెంట్స్
సాదాసీదాగా వన మహోత్సవం
ముఖం చాటేసిన కాంగ్రెస్ శ్రేణులు
వరంగల్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించి వెళ్లిపోయారు.
వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కొండా సురేఖ అధికా రులతో కలిసి మొక్కలు నాటారు. మంత్రి కుమార్తె సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నో కామెంట్స్’ అంటూ వెళ్లిపోయారు. అయితే మంత్రి పర్యటనకు కొందరు అనుచరులు మాత్రమే హాజరు కాగా, కాంగ్రెస్ శ్రేణులు ముఖం చాటేయడంతో సాదాసీదాగా కార్యక్రమం జరిగింది.
మంత్రిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు, మున్సిపల్ ఎన్నికల నాటికి వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిస్థితి ఏమిటో అనే సందిగ్ధత నెలకొంది. అటు ప్రభుత్వం, బడా నాయకులు, ఇటు మంత్రి తమ నియోజకవర్గ నేతల మధ్య సొంతకార్యకర్తలతోపా టు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇరకాటంలో పడ్డారు. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాము కోపం’ అన్న చందంగా తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.






