ఆరుతడి పంటల సాగుతో నష్టాలను తగ్గించుకోవాలి
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు
గోవర్ధనగిరి సర్పంచ్ ముంత జ్యోతి బిచ్చన్న యాదవ్
వీపనగండ్ల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వనపర్తి జిల్లా గోవర్ధనగిరి మండల గ్రామ సర్పంచ్ ముంత జ్యోతి బిచ్చన్న యాదవ్ సూచించారు. మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో శనివారం ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ముంత జ్యోతి బిచ్చన్న యాదవ్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నరేష్ మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగును తగ్గించి, కంది, మినుములు, పెసర, సజ్జలు, కొర్రలు, జొన్నలు, రాగులు, పామాయిల్ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటి వసతి సమృద్ధిగా ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేపట్టాలని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. అలాగే చిరుధాన్యాలు, తృణధాన్యాలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని వివరించారు.






