2 March, 2026 | 1:56 AM

హోలీ వేడుకలకు కేరాఫ్ అడ్రస్ ‘లోక్యతండా’

02-03-2026 12:00 AM
  1. మూడు రోజుల పాటు జరగనున్న హోలీ వేడుకలు
  2. రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా గుర్తింపు
  3. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్యతండాకు రానున్న బంజార బిడ్డలు
  4. ఊరంతా సందడి.. కోట్లలో ఖర్చు.. 
  5. రేపటి నుంచి లోక్యతండాలో హోలీ వేడుకలు ప్రారంభం 

కూసుమంచి, మార్చి1(విజయక్రాంతి): హోలీ వేడుకలకు కేరాఫ్ అడ్రస్ ‘లోక్యతండా’. మారు మూల గిరిజన గ్రామమైన ఈ తండాలో అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా హోలీ వేడుకలను గిరిజనులు జరుపుకుంటారు.. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజు హోలీ వేడుకలు జరిగితే.. ఈ తండాలో మాత్రం మూడు రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి.. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాధి మంది బంజార బిడ్డలు, బందువులు, విదేశాల నుంచి బంజార సోదరులు ఈ వేడుకల్లో పాల్గొంటారు..

అందుకే లోక్యతండాలో జరిగే హోలీ వేడుకలు మరీ స్పెషల్ అనోచ్చు.. మొదటి రోజు కోలాటం, రెండవ రోజు కాదాహనం, డూండ్, మూడవ రోజు రంగోలీ ఉత్సవాలను అక్కడ గిరిజనులు జరుపుకుంటారు.. వందేళ్ల నుంచి అచారంగా చేస్తున్నఈ వేడుకలో మూడురోజుల్లోనే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు ఇక్కడ బంజారులు.. ఆ మూడు రోజులు ఆ ఊరంతా పండుగే పండుగా.. హోలీ ప్రత్యేకకు మారుపేరైనా లోక్యతండా హోలీ సంబరాలపై ‘విజయక్రాంతి’ అందించే ప్రత్యేక కథనం..

 ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని లోక్యతండాలో హోలీ వేడుకలను అక్కడ బంజార పుత్రులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు చిన్నా,పెద్ద అంతా కలిసి ఆనందోత్సవాలతో హోలీ వేడుకలను జరుపుకుంటారు. ఇలా గత వందేళ్ల నుంచి ఈ తండాలో హోలీ ఉత్సవాలు జరుపుతున్నారు. బంజార సంస్కతికి, సంప్రధాయాలకు అద్దం పట్టే విధంగా కోలాటం, కామదాహనం, డూండ్, దండామారో, పాగ్రామ్, రంగోలీ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి బంజార కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలు జరుపుకుంటారు. అందుకే రాష్ట్రంలోనే అతిపెద్ద బంజార పండుగగా గుర్తింపు పొందింది.  ఈ హోలీ సంబరాలు ఈనెల 3 నుంచి 5వ తారీఖు వరకు కొనసాగనున్నాయి.  ఈ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు తండా పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఐదు గంటల కోలాటం

మూడు రోజుల హోలీ సంబరాల్లో భాగంగా మొదటి రోజు కోలాటం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మద్యాహ్నం ఒంటిగంటకు తండాలోని బంజారులందరు సెంటర్ చేరుకుని కోలాటమాడతారు. కుల పెద్ద గేరియా, ఖారోబారో డప్పు సప్పుడు చేసి హోలీ వేడుకలను ప్రారంభిస్తారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ‘హోలిలీ దండామారేబాయ్ బయ్ రే’ అంటూ కోలాటం నిర్వహిస్తారు. మహిళలు చప్పట్లతో గిరిజన ఆటపాటలతో సందడి చేస్తారు. సుమారు 5గంటల పాటు లోక్యతండా, జగ్మల్ తండా కూడలిలో కోలాటం నిర్వహిస్తారు. 

రెండవ రోజు కామదాహనం

రెండో రోజు ‘కామదాహనం’  నిర్వహిస్తారు. రాత్రి రెండుగంటల నుంచి ఈ వేడుక ప్రారంభమవుతుంది. ముందు రోజు రాత్రి తండాలోని రతి ఇంటి నుంచి కట్టెలు తీసుకొని కామదాహనం చేసే స్థలంలో కుప్పగా వేస్తారు. తెల్లవారుజామున గిరిజనులందరు కామదాహన స్థలం వద్దకు చేరుకోగా కులపెద్దలు గేరియా, ఖారోబారో తో పాటు గ్రామ పెద్దలు కట్టెల కుప్ప చుట్టు తిరుగుతూ బంజార బాషలో పాటలు పాడుతూ కామదాహనంను ప్రారంభిస్తారు.

యువకులు చేసే కేరింతలు, సందడి అంతాఇంతా కాదు.. కామదాహనం జరుతుండగా మహిళలు, బంజారులందరు కామదాహనం చుట్టు తిరుగుతూ పూజలు చేస్తారు. ఈ సంవత్సరంలో పుట్టిన చిన్నారులను అక్కడకు తీసుకొచ్చి పూజలు చేస్తారు. కాముడి ఆశీర్వదాలు పొందుతారు. పెళ్లీడుకొచ్చిన యువతులు కుల పెద్దల ఆశీర్వాదం పొందుతారు. అలాచేస్తే త్వరగా పెళ్లి అవుతుందని, మంచి భర్త వస్తాడని బంజారులు భావిస్తారు. 

చిన్నారులకు నామకరణమే ‘ఢూండ్’..

రెండో రోజు వేడుకల్లో ప్రధాన ఘట్టం ‘డూంఢ్’ వేడుక. గతహోలీ సమయం నుంచి ఇప్పటి హోలీ సమయం వరకు తండాలో మగ బిడ్డ పుట్టిన ఇళ్లలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుక సందర్భంగా చిన్నారులకు అన్నప్రసన నిర్వహిస్తారు. ఆ తరువాత పాయసం ఉడకబెట్టి ఉట్టికొట్టే కార్యక్రమం భలే సందడిగా ఉంటుంది. యువకులు కర్రలతో కర్రను కొడుతూ పాటలు పాడుతూ సందడి చేస్తారు. 

మూడవ రోజు రంగోలీ..

హోలీ వేడుకల్లో ప్రధానమైంది రంగోలీ. దీన్నే గిరిజనులు ‘ప్రాగ్రామ భరో’ అని పిలుస్తుంటారు. రెండు రోజుల పాటు అత్యంత దైవ భక్తితో వేడుకలు చేసుకునే బంజార సోదరులు మూడవ రోజు రంగోలీ వేడుకలు జరుపుకుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరు ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటారు. దీంతో హోలీ వేడుకలు ముగుస్తాయి.

కోట్లలో ఖర్చు..

లోక్యతండాలో నిర్వహించే మూడు రోజుల హోలీ వేడుకలకు గిరిజనులు అక్రాలుగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తారు. వాళ్లకు ఇదే అతిపెద్ద పండుగ. మూడు రోజుల పాటు తండాలో పండుగ వాతావరణం ఉంటుంది. మందు, విందు ఉంటుంది.. ఆ తండాలో జాతరే జాతర..