2 March, 2026 | 3:40 AM

బండ్ల సిరిగుట్టపై వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

02-03-2026 12:00 AM

అశ్వాపురం, మార్చి 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని సండ్రలబోడు, అమెర్ధ, చింతిర్యాల పంచాయితీల సరిహద్దులో గల బండ్ల సిరి గుట్టపై వెలసిన శ్రీ అలివేలు మంగ, భూనీళా సమేత వేంకటేశ్వర స్వామి వారి 20వ వివాహ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఈ కొండపై స్వామి వారు వెలసిన నాటి నుండి ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా, ఈ ఏడాది గుడి ధర్మకర్త మరియు కమిటీ అధ్యక్షులు గాదె ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని ఘనంగా జరిపారు.

భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరినీ స్వామి వారు చల్లగా చూడాలని కోరుకుంటూ, కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సండ్రలబోడు సర్పంచ్ తెల్లం నాగమణి-వెంకటేష్ దంపతులు, అమెర్ధ సర్పంచ్ కోర్స కృష్ణ, ఉప సర్పంచ్ మేకల అంజిబాబు, చింతిర్యాల సర్పంచ్ ఎనిక ఉషా రాణి-రవి బాబు దంపతులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి దంపతులతో పాటు మూడు గ్రామ పంచాయతీల పెద్దలు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.