25 August, 2026 | 7:50 AM

ఎస్‌సీఎస్‌సీ వార్షికోత్సవం

25-08-2026 12:12 AM

హైటెక్ సిటీ అవాసా హోటల్‌లో లోగో ఆవిష్కరణ

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) 20వ వార్షికోత్సవాన్ని హైటెక్ సిటీలోని అవాసా హోటల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించింది. ‘విశ్వసనీయ భాగస్వామ్యం, భద్రత, వృద్ధికి సంబంధించిన రెండు దశాబ్దాల వేడుక’ అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ ప్రముఖులు, భద్రతా నిపుణులు, వైద్య రంగ ప్రతినిధులు, మీడియా, కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడు తూ, ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, విస్తృత ఐటీ కమ్యూనిటీ భద్రత సైబరాబాద్ పోలీసులకు అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతగా కొనసాగుతోందన్నారు. గత రెండు దశాబ్దాలుగా పోలీసులకు ఎస్‌సీఎస్‌సీ అందిస్తున్న సహకారాన్ని, పబ్లిక్‌ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సంస్థ పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు.తెలంగాణ ఉద్యమం, కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీస్, పరిశ్రమ, ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం ద్వారా భద్రత, కార్యకలాపాలు, కమ్యూనిటీకి సంబంధించిన అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు.

సమస్యలకు స్పందించడం నుంచి ముందుగానే సవాళ్లను గుర్తించి ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా ఈ భాగస్వామ్యం పరిణామం చెందిందన్నారు. సురక్షితమైన, మరింత స్థిరమైన సైబరాబాద్ నిర్మాణానికి పోలీస్‌పరిశ్రమసమాజం మధ్య నిరంతర సహకారం అవసరమని తెలిపారు. ఎస్‌సీఎస్‌సీ మాజీ సెక్రటరీ జనరల్ డా. కృష్ణ యేడుల మాట్లాడుతూ, సైబరాబాద్ ఐటీ కారిడార్ ప్రారంభ దశలను, సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న ఆలోచనలను గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ @ 20 లోగోను ఆవిష్కరించడంతో పాటు  ‘సంస్థలకు సాధికారత ఎస్‌సీఎస్‌సీ రెండు దశాబ్దాలు’   అనే స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎస్‌సీఎస్‌సీ డైరెక్టర్  స్ట్రాటజిక్ రిలేషన్స్ మిస్ నాన్సీ సాహు కళా ప్రదర్శన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ముగింపులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ప్యానెలిస్టులు, ప్రముఖులు, విశిష్ట భాగస్వాములను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.