25 August, 2026 | 2:58 AM

యశోదలో రెండేళ్ల బాలికకు అత్యాధునిక చికిత్స

25-08-2026 12:15 AM

మూర్ఛ వ్యాధి నుంచి కాపాడిన హాస్పిటల్స్ వైద్యులు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): భువనగిరికి చెందిన సైదులు, మహేశ్వరి దంపతుల రెండేళ్ల కుమార్తె వాగ్దేవికి యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌లో అత్యాధునిక ఎపిలెప్సీ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆరు నెలల వయస్సు నుంచే ప్రతిరోజూ తీవ్రమైన మూర్ఛలతో బాలిక బాధపడుతుండేది.

దీంతో యశోద హాస్పిటల్స్ వైద్యులు ఆ చిన్నారికి అత్యాధునిక శస్త్రచికిత్స చేయడంతో  మూర్ఛలు పూర్తిగా నిలిచిపోయాయి. బాలికకు ఏడాది కాలంగా పలు రకాల యాంటీ-సీజర్ మందు లు అందించినప్పటికీ ప్రతిరోజూ మూర్ఛలు కొనసాగాయి. దీంతో పాటు మాట, శారీరక,మానసిక అభివృద్ధిలో కూడా ఆలస్యం కనిపించింది. వైద్యులు శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన సమగ్ర పరీక్షలు, మెదడు ఎంఆర్‌ఐ, పీఈటీసీటీ పరీక్షల్లో ఎడమ టెంపోరల్ ప్రాంతంలో, అమిగ్డాలా, హిప్పోక్యాంపస్‌కు సమీపంలో ఉన్న చిన్న లెజన్ (అసాధారణ కణజాల ప్రాంతం) మూర్ఛలకు కారణమవుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ కేసులో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, న్యూరోఅనస్థీషియాలజిస్ట్లతో కూడిన ప్రత్యేక పీడియాట్రిక్ న్యూరో టీమ్ సమన్వయంతో చికిత్స అందించింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్. ఎన్. వర్షా మోనికారెడ్డి మాట్లాడుతూ, ఈ చిన్నారి ఆరు నెలల వయస్సు నుంచే దాదాపు ప్రతిరోజూ తీవ్రమైన మూర్ఛలతో బాధపడుతుండేది. పలు యాంటీ-సీజర్ మందులు వాడినప్పటికీ మూర్ఛలు నియంత్రణలోకి రాలేదు. జూలై 26న చిన్నారిని యశోద హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్నారు. యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ఆర్ అయ్యదురై మాట్లాడుతూ, శస్త్రచికిత్సలో భాగంగా అంటీరియర్ టెంపోరల్ లోబెక్టమీ నిర్వహించి, మూర్ఛలకు కారణమవుతున్న అసాధారణ కణజాల ప్రాంతమైన లెజన్ను విజయవంతంగా తొలగించామన్నారు.