20 May, 2026 | 6:06 AM

సభ్యత్వ నమోదుతో పార్టీని పటిష్టం చేద్దాం

20-05-2026 12:32 AM

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, మే 19 ( విజయక్రాంతి ) : సభ్యత్వ నమోదుతో పార్టీని పటిష్టం చేద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులకు సూచించారు. మంగళవారం జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలిచే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోయాయని అన్నారు.

అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నా యకులు, కార్యకర్తలు పార్టీ పట్ల అంకితభావంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గతంలో నియోజకవర్గంలో 70 వేలకుపైగా సభ్యత్వాలు నమోదయ్యాయని గుర్తుచేశారు. సభ్యత్వ నమోదులో అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీ పట్ల విధేయత, చిత్తశుద్ధి, నాయకత్వంపై విశ్వాసం కలిగిన కార్యకర్తలకు సంస్థాగత పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే శక్తిగా పార్టీ కార్యకర్తలు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులకే పార్టీ భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన యువత ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.