మొక్కలను నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, ఆగస్టు 25 : జనగామ మండలంలోని చౌడారం గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవ లక్ష్యాలను ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు వృక్షాలు ఎంతో కీలకమని పేర్కొంటూ మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాలు,పట్టణాల్లో గల ఖాళీ ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రహదారుల పక్కన, చెరువుల పరిసరాల్లో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి, విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.
మొక్కలు నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్, డీఏఓ అంబికా సోనీ, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ మహేష్ నాయక్, సర్పంచ్ కె. పద్మ, ఉప సర్పంచ్ ప్రవీణ్, ఇతర సంబంధిత అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులున్నారు.






