ఎల్ నినోను సమష్టిగా ఎదుర్కొందాం
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం
- సమీక్షా సమావేశంలో ‘తెలంగాణ జలసిరి’ పోస్టర్ ఆవిష్కరణ
రంగారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున, రైతులు మరియు ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, ’మిషన్ మోడ్’లో పనిచేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ఎల్-నినో ప్రభావం - ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక‘ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలు కీలక అంశాల పై సమీక్ష నిర్వహించారు.
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులుగా తక్కువ నీటితో పండే పెసర, కంది, జొన్న, రాగులు వంటి పంటలను ప్రోత్సహించాలని, అలాగే ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, పూల సాగుపై రైతులు దృష్టి సారించేలా మండల స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు అవసరమైన ప్రత్యామ్నాయ విత్తనాలను తక్షణమే అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి నిర్వహణ, విద్యుత్ సరఫరా..
జిల్లాలో తాగునీటి కొరత రాకుండా జలవనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగిం చుకోవాలని తెలిపారు. అవసరమైన ప్రాం తాల్లో కొత్త బోర్లు తవ్వించడంతో పాటు తాగునీటి బోర్లకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 27 మండలాల్లో 8 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైందని, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గుతోం దని ప్రజాప్రతినిధులు తెలిపారు.
మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలను అరికట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా తప్పనిసరిగా నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపట్లేలా నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి లు కోరారు.పశువులకు పశుగ్రాసం కొరత లేకుండా చూసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడం, వైద్య సేవలు అందించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ ప్రణాళికలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నాయకులు, అధికారులు కలిసి ’తెలంగాణ జలసిరి’ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్లు సవ్యసాచి, వికాస్ రాజ్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, మేడ్చల్‌మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






