టెట్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
అభినందనీయమన్న కన్వీనర్ రమేష్
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) అధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను మంగళవారం ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ జి.రమేష్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సామాజిక బాధ్యతతో పాటు ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ స్టడీ మెటీరియల్ ముద్రించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని డైరెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ.. పేపర్--1, పేపర్-2లకు సంబంధించి 5 వేల సెట్లు ముద్రించామన్నారు. ఒక్కో సెట్‌లో ఆరు పుస్తకాలు ఉంటాయని, వీటిని రాష్ట్రంలోని 33 జిల్లా శాఖల ద్వారా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచామన్నారు.
స్పెషల్ టెట్‌కు హాజరయ్యే దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. పర్వత్ రెడ్డి, సంఘ మాసపత్రిక ఎడిటర్ ఎల్‌యం ప్రసాద్ పాల్గొన్నారు.






