25 June, 2026 | 5:16 PM

ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి

25-06-2026 03:11 PM

- జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ బహిరంగ సభకు పిలుపు

- ఉద్యమకారులకు 250 గజాల భూమి, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

- విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి

గజ్వేల్,( విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన చేపట్టిన “ఉద్యమకారుల భూ పోరాటం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారుల భూ పోరాటం బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ భవాని వేముల, శివశంకర్ ప్రజాపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ పిలుపు మేరకు జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించనున్న ఉద్యమకారుల భూ పోరాట బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచినా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఉద్యమకారులను మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, సీనియర్ ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల పెన్షన్, అమరవీరుల కుటుంబాలకు రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ‘కేకే కమిటీ’ పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి,  కవిత, మాజీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, నాయకులు నరేందర్ రెడ్డి, రాజు, చందు, ప్రసాద్, నర్సింలు, నరేష్, హరి తదితరులు పాల్గొన్నారు.