6 April, 2026 | 5:26 PM

తూతూ మంత్రంగా ప్రజావాణి

06-04-2026 03:19 PM

ప్రజావాణికి కొరవడిన స్పందన 

పలు శాఖాల అధికారులు గైర్హాజరు 

కేవలం ఒకటే ఆర్జీ

పాపన్నపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నా అధికారుల నుంచి త్వరగా స్పందన రావడంలేదని, మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు సర్వత్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రజావాణిలో ఆర్జీ చేసుకున్న సమస్య త్వరితగతిన పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఆర్జీలు అందించేందుకు ఉత్సాహం చూపడం లేదు.

సోమవారం పాపన్నపేటలో నిర్వహించిన ప్రజావాణి కి కేవలం ఒక్క ఆర్జీ మాత్రమే రావడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదు. నాలుగైదు శాఖలు మినహా మిగతా శాఖల అధికారులు ప్రజావాణి కి హాజరు కావడం లేదు. దీంతో ఆ శాఖకు ఆర్జీ పెట్టుకోవాలని వచ్చిన ఆర్జీదారులు వెనుదిరిగి వెళ్తున్నారు. మండల కేంద్రంలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నారని ప్రజలకు అవగాహన లేకపోవడంతో మెదక్ కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెళ్లి ఆర్జీలు సమర్పిస్తున్నారు. ప్రజావాణి పై ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తే మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి స్పందన లభిస్తుందని పలువురు విన్నవిస్తున్నారు.