calender_icon.png 23 February, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరు గొప్ప.. ఊరు దిబ్బ..

23-02-2026 12:34:13 AM

అయిజలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కనీస సౌకర్యాలు కరువు

సుదూరంలో ఉన్న ఫైర్ సిబ్బంది వచ్చేలోపు  బూడిదవుతున్న సంఘటనలు

నాయకుల మాటలు నీటిమీద రాతలేనా? 

ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజల వేడుకోలు

అయిజ, ఫిబ్రవరి 22: గద్వాల జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ పలు రకాల వ్యాపార సముదాయాలకు మంచి కమర్షియల్ స్పేస్ గా అయిజ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది.ఒకవేళ ప్రభుత్వం నియోజకవర్గ విభజన అనే అంశం మొదలు పెడితే  అన్ని అర్హతలు ఉన్న  అయిజకు ముందు చోటు వచ్చే ఛాన్స్.అటు ఏపీ, ఇటు కర్ణాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన సరిహద్దు ప్రాంతం కావడంతో వ్యాపార లావాదేవీలకు ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది.అంతేకాక అత్యధిక జన సాంద్రత  కలిగిన పట్టణంతోపాటు సుమారు 22గ్రామాలతో పాటు రాజోళి, వడ్డేపల్లి వంటి మండలాలు ఐజ సమీపంలో కలిగి ఉన్నాయి.

పట్టణంలో పలు ప్రైవేటు స్కూల్స్ జూనియర్ కళాశాలలు,హాస్పిటల్స్ తో పాటు మార్కెట్ వ్యాపార సముదాయాలు కలిగి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం పట్టణ శివారులో పలు డ్రిప్ ఫ్యాక్టరీలతో పాటు సీడ్ ఆర్గనైజర్ లకు సంబంధించిన జిన్నింగ్ మిల్లులు ఉండడంతో కూలీలకు,వ్యాపారాలకు  నిలయంగా మారింది. ఈ ప్రాంతాల్లో అనుకోకుండా ఏదైనా విపత్తు సంభవిస్తే... కనీస సౌకర్యాలు కరువయ్యాయని ప్రజల్లో చర్చ జరుగుతుంది. కొన్ని సౌకర్యాలు లేక పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా  తయారైందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇంతటి పేరు గల ఐజకు పరిసర ప్రాంతాలలో ఏదైనా విపత్తు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.... ఆ విపత్తును అరికట్టే సేవలు పూర్తిగా  కరువయ్యాయి.ఇప్పటి వరకు ఐజ పట్టణం ఫైర్ స్టేషన్‌కు నోచుకోలేని పరిస్థితి నెలకొంది.

ఇట్టి విషయమై ప్రజలు నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నవించినా ..ఫలితం శూన్యంగా మారిందని ప్రజలు  చర్చించుకుంటున్నారు.ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులు అమలు కానీ హామీలు ఇచ్చి గెలిసిచిన తర్వాత ఆ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నా చర్చ కూడా  ప్రజల్లో జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు మాటలు నీటి మీద రాతలుగా మారాయి తప్ప..పట్టించుకునే నాథుడు లేడని  పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.

మూడు కోట్ల విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి! 

ఇటీవలే వరుసగా సంభవించిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే లక్షలు, కోట్లు విలువ చేసే వస్తువులు అగ్నికి కాలి బూడిదయ్యాయి.అనుకోకుండా  అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు అదుపు చేసేందుకు కష్టతరంగా మారింది. సుమారు అలంపూర్ చౌరస్తాలోని 40 కిలో మీటర్ల మేర దూరంలో ఉన్న అగ్ని మాపక కేంద్రం గతుకుల రోడ్డుపై సకాలంలో చేరుకోలేక గంటల సమయం పట్టే పరిస్థితి నెలకొంది.ఈలోపు బూడిద మిగిలే సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.

పోయిన ఏడాది తుప్పత్రాల , సంకాపురం గ్రామాల్లో గడ్డి వాములు అగ్ని ప్రమాదానికి గురై రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి.కాగా ఇటీవలే శనివారం పట్టణ శివారులో ఓ ప్రముఖ డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో పెను అగ్ని ప్రమాదం సంభవించింది.మంటలు ఉవ్వెత్తున ఎగసి పడి ఫ్యాక్టరీ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఫ్యాక్టరీలో ఉన్న డ్రిప్ పైపులు,ముడి సరుకులు ,యంత్రాలు పూర్తి దహనమయ్యాయి.

మంటలను అదుపు చేసేందుకు ఏ మాత్రం వీలు లేకుండా పోయిందని ప్రజల్లో చర్చ జరుగుతోంది.దాదాపు ఫ్యాక్టరీ యజమానికి మూడు కోట్ల రూపాయలు మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లూ యజమాని కన్నీరు పెట్టుకున్నారు.మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పాలకులు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అయిజ పట్టణ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని పట్టణ ప్రజలతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి 

ఐజ పట్టణం ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి పోతారు తప్ప ఆ హామీలను నెరవేర్చడంలో విఫలం అవుతున్నారు. ప్రజల సౌకర్యాలను రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఫైర్ స్టేషన్ చేస్తే ఏదైనా విపత్తు సంబంధించినప్పుడు వెంటనే మంటలను అదుపు చేసి నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అధికారులు పాలకులు దీని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాం.

విజయ్ కుమార్, అడ్వకేట్