calender_icon.png 23 February, 2026 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతి వనాన్నే కొట్టేస్తే ఎట్లా?

23-02-2026 12:32:28 AM

దర్జాగా తొలగించిన పట్టించుకునేది ఎవరు?

ఉత్తమ గ్రామ పంచాయతీ జీనుగురాలలో ఘటన

విచారణ చేస్తున్నాం అంటున్న ఫారెస్ట్ అధికారులు

దేవరకద్ర, ఫిబ్రవరి 22: ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్వహణ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. పల్లె ప్రకృతి వనంలో దర్జాగా ఉన్న చెట్లను తొలగించిన మమ్మల్ని ఆపేదెవరో అనే విధంగా అడుగులు పడుతున్నాయి అంటే పల్లె ప్రకృతి వనాలపై అధికారులకు ఏమాత్రం పట్టింపు వుందో ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారెస్ట్ అధికారులు మాత్రం చెట్లను నరికి వేసిన తర్వాత విచారణ చేపడతాం? చర్యలు తీసుకుంటాం? జరిమానా విధిస్తాం? అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా నరికి వేస్తున్న చెట్లను ఆపే ప్రయత్నం చేయడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రతి మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు నుంచి ఎవరో ఒక అధికారి ప్రతి గ్రామంలో పరిసర ప్రాంతాల్లో  విధి నిర్వహణ ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఎక్కడైనా ఏ ప్రాంతమైన చెట్లను నరికి వేస్తున్న తొలగిస్తున్న నిలుపుదల చర్యలు మాత్రం తీసుకోవడం లేదని కేవలం పత్రికల్లో రాస్తేనో, ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో పట్టించుకుంటున్నారే తప్ప బాధ్యతగా పట్టించుకునే అధికారులు కరువయ్యారని ప్రజలే చెబుతున్న మాట. ఇకనైనా కొంచెం చెట్లను నాటడంతోపాటు రక్షించే బాధ్యత కూడా తీసుకుంటే ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. 

ఉత్తమ గ్రామ పంచాయతీలో గిట్లనా?

దేవరకద్ర నియోజకవర్గం లోని జీనుగురాల గ్రామం పల్లె ప్రకృతి వనంలో చెట్లను తొలగించిన ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఇటు ఫారెస్ట్ అధికారులకు అటు రెవెన్యూ అధికారులకు సమాచారం లేకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు తమ ఇస్టారీతిగా పల్లె ప్రకృతి వనంలోని చెట్లను తొలగించడం పై  అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పల్లె ప్రకృతి వనంలో సుమారు 200 గజాల జాగా వరకు అంగన్వాడి కేంద్రం కోసం కేటాయించగా, ఆ పనులు ఇంకా ఆదిలోనే ఉన్నాయి.

తాజాగా శనివారం దాదాపు 200 చెట్లను జెసిబి సాయంతో తొలగించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. అధికారుల అనుమతి లేకుండా, చెట్లను తొలగించి అక్కడ ఏం చేస్తారో కనీస సమాచారం లేకుండా ఎవరికీ తెలియకుండా  ఇస్తా రీతిగా వ్యవహరించడంపై అధికారులకు సమాచారం అందించారు. చెట్లను తొలగించే ఫోటోలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెట్లను తొలగించే పనులు మధ్యలో నిలిపివేసినట్లు సమాచారం. 

ఇదే విషయమై దేవరకద్ర ఎంపీడీవోను వివరణ కోరగా తనకు సమాచారం అందింది అని వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ ను చెట్ల నరికి వేత పై అనుమతి ఉందా అని సమాచారం కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని అనుమతి లేకుండా చెట్లను తొలగించడం నరికి వేయడం చట్టరీత్యా నేరం అని తెలిపారు. ఆదివారం గ్రామానికి వెళ్లి విచారించి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై అసలు చర్యలు తీసుకోవడం జరుగుతుందా జరగదని అనుమానాలకు ఉన్నాయని పలువురు చెబుతున్నారు.