calender_icon.png 23 February, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దామరగిద్దలో ‘మట్టి’ మాఫియా మాయాజాలం

23-02-2026 12:46:14 AM

  1. ప్రభుత్వ భూమికి నిలువునా కన్నం!
  2. సెలవు రోజుల్లోనే ‘చీకటి’ దందా.. ఫామ్ ల్యాండ్ వెంచర్లకు అక్రమ తరలింపు.. 
  3. పట్టించుకోని యంత్రాంగం!

చేవెళ్ల, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ అండదండలు వెరసి చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సామాన్యుడు ఒక గుప్పెడు మట్టి తీయాలంటే వంద నిబంధనలు పెట్టే యంత్రాంగం, వందల ట్రిప్పుల ప్రభుత్వ సంపద తరలిపోతుంటే కళ్లు మూసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీకెండ్ ప్లాన్.. రాత్రిపూట స్కెచ్..

దామరగిద్ద రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 153 ప్రభుత్వ భూమి ఇప్పుడు మట్టి మాఫియాకు కాసుల కురిపించే గనిలా మారింది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండే శని, ఆదివారాలను ఆసరాగా చేసుకుని ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. చీకటి పడగానే జేసీబీలు గర్జిస్తున్నాయి.. ట్రాక్టర్లు పరుగులు తీస్తున్నాయి. మట్టి తరలింపులో రెండు ట్రాక్టర్లు (AP15 AE 1817, AP 28 T- 97) మరియు ఒక జేసీబీ (TS 27 F 8819) నిరంతరం

ఈ అక్రమ రవాణాలో పాల్గొంటున్నాయి. బస్తేపూర్ శివారులో వెలుస్తున్న కొత్త ఫామ్ ల్యాండ్ వెంచర్ల మెరక కోసమే ఈ మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం.ప్రమాదకరంగా మారుతున్న భూములుఅడ్డగోలుగా తవ్వకాలు జరపడంతో సదరు సర్వే నంబర్ భూమిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. అటుగా వెళ్లే పశువులకు, మనుషులకు ఇవి మృత్యుపాశాలుగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కేవలం నామమాత్రపు తనిఖీలతో అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని, పట్టుబడిన వాహనాలను సైతం రాజకీయ ఒత్తిళ్లతో వదిలేస్తున్నారని గ్రామస్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అక్రమ మట్టి తరలింపు విషయం గురించి స్థానిక తాసిల్దారును వివరణ కోరగా  ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టిని, మోరాన్ని అక్రమంగా తరలిస్తే సహించేది లేదు. దామరగిద్దలో జరుగుతున్న

తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన కేసులు నమోదు చేస్తాం. అని తహసీల్దార్ హరికృష్ణ తెలిపారు.అక్రమ తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని ఉన్నతాధికారులు సందర్శించాలి.తవ్వకాల్లో పాల్గొన్న వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానాలు విధించాలని  రాజకీయ జోక్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.