పర్యావరణ పరిరక్షణ మానవ మనగడకు మొక్కలే జీవన ఆధారం
* కీతవారిగూడెంలో రహదారుల వెంట మొక్కలు నాటిన కెవికె విద్యార్థులు
* పచ్చదనం–పరిశుభ్రతపై అవగాహన
గరిడేపల్లి,(విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ, మానవ మనగడకు మొక్కలే జీవన ఆధారమని సెయింట్ థెరిస్సా కళాశాల ఫర్ ఉమెన్ ఏలూరు విద్యార్థులు అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంగరిడేపల్లి మండల పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కళాశాల ఏలూరు విద్యార్థులు మంగళవారం కీతవారిగూడెంలో వనమహోత్సవం, డెంగ్యూ–మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వనమహోత్సవంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా విద్యార్థులు, గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, స్వచ్ఛమైన గాలి అందడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
అనంతరం కీతవారిగూడెం ప్రాథమిక పాఠశాలలో డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం, చెత్త పేరుకుపోవడం వల్ల దోమల వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. నీరు నిల్వ ఉండకుండా చూడటం, చెత్తను నిర్ణీత ప్రదేశాల్లోనే వేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థ పదార్థాలు, మురుగు ప్రాంతాలను గ్రామపంచాయతీ సహకారంతో యంత్రం ద్వారా తొలగించి పరిశుభ్రం చేశారు. దోమల నివారణకు నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాధం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై విద్యార్థులు అవగాహన కల్పించడాన్ని గ్రామస్థులు అభినందించారు.






