8 May, 2026 | 3:55 AM

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి

08-05-2026 12:00 AM

ఎంపీడీవో శేషగిరి శర్మ

మిర్యాలగూడ, మే 7 : ప్రస్తుత యాసంగి సీజన్‌లో వ్యవసాయ పనులు ముగిసినందున గ్రామాలలో కూలీలు మిరపకాయ కూళ్లకు తదితర ఇతర పనులు వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా జాబ్ కార్డు కలిగి పని అడిగిన ప్రతి కూలికి ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపీడీవో ఎం. శేషగిరి శర్మ అన్నారు. మండలంలోని ఊ ట్లపల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి పనులు జరిగే ప్రదేశాలలో నీడ కల్పించడంతోపాటు, మంచినీరు, ఓఆర్‌ఎస్ పాకెట్లను, ప్రథమ చికిత్స చర్యలను చేపట్టే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కూలీలకు కొలతల ప్రకారం పనులు చేయించి గరిష్ట వేతనం పడేలా చూడటంతో పాటు వాటిని సకాలంలో అందించేలా చూడాలన్నారు. పనులు జరిగే ప్రదేశాలను ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీలకు పనులపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులను ముమ్మరం చేసి లేబర్ రిపోర్టును పెంచాలన్నారు.

పనుల పారదర్శక నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం గ్రామంలో గ్రామ సమాఖ్య భవనాన్ని, జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ గోడ  నిర్మాణాలను, వన నర్సరీని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొనకంచి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ మాతంగి రవి, పంచాయతీ కార్యదర్శి రమేష్, క్షేత్ర సహాయకులు ఆంజనేయులు తదితరులున్నారు..