రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..?: కేటీఆర్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. పంట కొనుగోళ్లపై ప్రభుత్వానికి మొద్దునిద్ర ఇంకెన్నాళ్లు?, ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా..? కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణమృదంగమేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేబినెట్ సమావేశంలో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడు, రాస్తారోకో జరగని రహదారి లేదన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారని హెచ్చరించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని సీఎం రేవంత్ కు రాసిన లేఖలో కేటీఆర్ నిప్పులు చెరిగారు.









