రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయానికి(Telangana Secretariat) ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద, భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక విప్లవాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఐటీ, కంప్యూటర్ , టెలికాం రంగాలను దేశానికి తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ అని సీఎం కొనియాడారు.
రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారని తెలిపారు. చట్టసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం(Rahul Gandhi's Family) దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. తెలంగాణ సమాజం సోనియాగాంధీ కుటుంబానికి ఎంతో రుణపడిందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ తో లింక్ పెట్టారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.






