20 లక్షల ఇండ్లు కట్టిస్తేనే ఓట్లు అడగాలి.. పొంగులేటికి KTR సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Government) మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఇళ్ల నిర్మాణంపైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. మంత్రి పొంగులేటి ప్రతి సవాలు విసిరారు. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని చాలెంజ్ చేసిన మంత్రికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మంత్రి తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం శపథం చేయడం కాదని, చేతనైతే చేసి చూపించాలని డిమాండ్ చేశారు. 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే ప్రజల గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతాం అన్న సవాల్‌కు పౌరుషం ఉంటే కట్టుబడి ఉండాలన్నారు. దమ్ముంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనాలని సవాల్ విసిరారు. మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టాలని కేటీఆర్ మంత్రి పొంగులేటికి సవాల్ విసిరారు. గత రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని? పడగొట్టిన ఇండ్లు ఎన్ని? అనే దానిపై శ్వేత పత్రం ప్రకటించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
దీపావళికి బాంబులు పేలుస్తామని చెప్పి తుస్సు మనిపించిన 'తుపేల్ మినిస్టర్', 'మిస్టర్ బాంబులేటి’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొంగులేటి మాదిరి కోహినూరు హోటల్లో కాళ్లు పట్టుకొని, ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదని కేటీఆర్ తేల్చిచెప్పారు. రెవిన్యూ శాఖను అడ్డుపెట్టుకొని భూభారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్, గూండాలను ఉసిగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను లాక్కుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మగౌరవ ఇళ్లు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదని కేటీఆర్ వెల్లడించారు.






