NTR 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట, మే 28(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుని తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా నిలిచారని కొనియాడారు. పేదప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. తెలుగువారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావని, ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జారే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
బాలాజీ సెంటర్లో మండల కేంద్రంలోని బాలాజీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103 వ జయంతిని పురస్కరించుకొని దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం బాలాజీ సెంటర్లో గల ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఎండి వలీపాషా, నాయుడు వీరా స్వామి, బంధం శ్రీనివాసరావు, ఉయ్యాల లక్ష్మీనారాయణ, బోగీ సత్యం, చక్రపు ప్రసాదు, చిర్రి ధర్మారావు, దయాకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.






